రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు

No Comment Yet
328 Views

రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు

రాజకీయాల్లోకి రావాలని ఎన్నడూ అనుకోలేదని ప్రధాని మోదీ వెల్లడించారు. కానీ, ప్రస్తుతం రాజకీయాల్లో ఒక భాగమై, దేశ ప్రజలకు సాధ్యమైనంత మేరకు సేవ చేసేందుకు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం సహనం, సంయమనం, పరిణతి చూపిన దేశ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ప్రధాని ఆకాశవాణిలో మాసాంతపు ‘మన్‌ కీ బాత్‌’లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎన్‌సీసీ (నేషనల్‌ కేడెట్‌ కార్ప్స్‌) కేడెట్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.

‘రాజకీయాల్లోకి ప్రవేశించాలని కానీ, రాజకీయాల గురించి కానీ ఎన్నడూ ఆలోచించలేదు. కానీ, ఇప్పుడు రాజకీయ నేతగా మారా. దేశ సంక్షేమం కోసం శాయశక్తులా కృషి చేస్తున్నా. దేశ సేవకే పూర్తిగా అంకితమైపోయా’అని ప్రధాని తెలిపారు. ‘చదవడం నాకు చాలా ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలు చదువుతా. అప్పుడప్పుడు సినిమాలు, చాలా తక్కువగా టీవీ చూస్తుంటా. కానీ, గూగుల్‌ ప్రభావం పుస్తక పఠనంపై పడింది. ఏ విషయం గురించి అయినా గూగుల్‌లో వెంటనే తెలుసుకోవచ్చు. అందుకే పుస్తకాలు చదవడం తగ్గిపోయింది’ అని అన్నారు.

‘పాఠశాల రోజుల్లో ఎన్‌సీసీ కేడెట్‌గా చాలా క్రమశిక్షణతో ఉండేవాడిని. అందుకే ఎన్నడూ శిక్షకు గురికాలేదు. ఓసారి చెట్టు కొమ్మపై గాలిపటం దారంలో ఇరుక్కున్న పావురాన్ని రక్షించేందుకు చెట్టెక్కా. పై అధికారి నన్ను శిక్షిస్తారని అక్కడున్న వారంతా అనుకున్నారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు’అని చిన్ననాటి ఘటనను ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. అయోధ్య తీర్పు అనంతర పరిస్థితులపై ప్రధాని మాట్లాడుతూ.. ‘జాతి ప్రయోజనాలకే పెద్దపీట అని 130 కోట్ల మంది దేశ ప్రజలు మరోసారి నిరూపించారు. ఆ తీర్పును విశాల హృదయంతో ఆహ్వానించారు. సహనం, సంయమనం, పరిణతి చూపిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు.  ఇదే స్ఫూర్తితో ఐకమత్యం, శాంతి, సౌభ్రాతృత్వంతో ముందుకు సాగుతుందని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.

విశాఖ స్కూబా డైవర్లకు ప్రధాని ప్రత్యేక ప్రశంసలు
పర్యావరణం, సుముద్ర జీవుల పరిరక్షణకు విశాఖకు చెందిన ‘ప్లాటిపస్‌ ఎస్కేప్‌’అనే సంస్థకు చెందిన స్కూబా డైవర్లు చేస్తున్న కృషిపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ వీరిని మన్‌ కీ బాత్‌లో ప్రశంసిం చారు.  వీరు తీరానికి 100 మీటర్ల దూరంలో సుముద్ర గర్భం లోపలికి వెళ్లి అక్కడ పేరుకుపోయిన ప్లాస్టిక్‌ను తొలగిస్తున్నారని, రెండు వారాల్లో 4 వేల కేజీల ప్లాస్టిక్‌ను తొలగించినట్లు తనకు తెలిసిందని ప్రధాని వివరించారు. ఈ ప్రక్రియలో స్కూబా డైవర్లకు స్థానికులు సహకరిస్తున్నారని, వీరి చిరు ప్రయత్నం ఇప్పుడు ఉద్యమంగా మారుతోందన్నారు.

(this news is taken from sakshi news)

dailyreport

Author

dailyreport

Up Next

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *