రజనీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం

No Comment Yet
321 Views

రజనీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకోవడం ఖాయమని నటుడు రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యానాలు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపాయి. అధికార, ప్రతిపక్షాలు అనే తేడాలేకుండా రజనీ వ్యాఖ్యలను అందరూ తిప్పికొట్టారు. కొందరు ఎద్దేవాచేయగా, మరికొందరు చురకలు అంటించారు. 

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తే అన్నాడీఎంకే లేదా డీఎంకే అధికారంలోకి రావడం దశాబ్దాలుగా పరిపాటి. అన్నాడీఎంకే తరువాత అనేక పార్టీలు పుట్టుకొచ్చినా అధికార అందలం ఎక్కలేకపోయాయి. ఈ దశలో కమల్‌హాసన్‌ రాజకీయ ప్రవేశం చేసి మక్కల్‌ నీది మయ్యం అనే పార్టీని స్థాపించారు. ఒకవైపు పార్టీ ఏర్పాటు మరోవైపు సినిమా షూటింగులతో రజనీకాంత్‌ కాలం గడుపుతున్నారు. ప్రజల మేలు కోసం రాజకీయంగా ఇద్దరం ఏకం కావడానికి సిద్ధమని కమల్‌హాసన్, రజనీకాంత్‌ ఇటీవల ప్రకటించడం పెద్ద చర్చనీయాంశమైంది.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతాలు: రజనీ
చెన్నై విమానాశ్రయంలో మీడియా అడిగిన పలుప్రశ్నలకు రజనీకాంత్‌ ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. రాజకీయాల్లో కమల్‌తో కలిసి అడుగేస్తే మీ ఇద్దరిలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని మీడియా ప్రశ్నించగా ఎన్నికల సమయంలో మా పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం ఇప్పుడే చెప్పలేనని సమాధానం ఇచ్చారు. తమిళనాడు ద్రావిడభూమి ఆధ్యాత్మికవాద రాజకీయాలకు తావులేదని మంత్రి జయకుమార్‌ చేసిన వ్యాఖ్యానాలపై స్పందిస్తూ 2021 సంవత్సరంలో తమిళనాడు ప్రజలు అత్యద్భుతాలను, ఆశ్చర్యకరమైన రాజకీయాలకు తెరదీస్తారని బదులిచ్చారు. ఇది నూరుశాతం తథ్యమని అన్నారు.

రాజకీయ దుమారం: 
2021లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా జార్జికోటపై జెండా ఎగురవేయాలని అన్నాడీఎంకే, డీఎంకే పట్టుదలతో ఉండగా, ఈరెండు పార్టీలు అధికారంలోకి రావన్నట్లు రజనీకాంత్‌ సంచలన వ్యాఖ్యలు చేసి రాజకీయ దుమారానికి తెరదీశారు. 2021లో కూడా అన్నాడీఎంకే ప్రభుత్వమే వస్తుందనే రజనీకాంత్‌ చెబుతున్న అశ్చర్యకరమైన సంఘటనని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి అన్నారు. అసలు రజనీకాంత్‌ పార్టీనే పెట్టలేదు, కమల్‌తో కలిసి పనిచేయడం ఏమిటని అన్నారు. పార్టీ పెట్టిన తర్వాత మాట్లాడమనండని వ్యాఖ్యానించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రజనీకాంత్‌ ప్రచారానికి వచ్చినా అన్నాడీఎంకే అభ్యర్థుల గెలుపునకు ఎలాంటి ఢోకాలేదని మంత్రి తంగమణి ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ అభ్యర్థులు నూరుశాతం గెలుస్తారు, తమ కూటమిలో ఎలాంటి సమస్యలు లేవని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయని రజనీకాంత్‌ అన్న మాటలకు 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేనే మళ్లీ అధికారంలో వస్తుందని అర్థమని మంత్రి జయకుమార్‌ వ్యాఖ్యానించారు. రజనీ ప్రస్తుతం మంత్రవాదిగా మారిపోయి ‘ఛూం మంత్రకాళీ’ అంటూ సోది చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

రజనీ, కమల్‌ ప్రజల కోసం ఏమి చేశారు, ప్రజా సమస్యలపై ఏనాడైనా పోరాడారాని ప్రశ్నించారు. ప్రజల కోసం పాటుపడేవారికే ఓట్లు పడతాయని ఆయన అన్నారు. రజనీ, కమల్‌ కలిసివచ్చినా రాజకీయాల్లో రాణించలేరని తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు కేఎస్‌ అళగిరి అన్నారు. రజనీ అంటున్న ఆశ్చర్యకరమైన సంఘటనలు ఆయన కొత్త చిత్రం కథలోని అంశం కాబోలని ఎద్దేవా చేశారు. 2021లో డీఎంకే అధికారంలోకి వస్తుందని నర్మగర్భంగా రజనీ చెబుతున్నారని డీఎంకే ఎమ్మెల్యే అన్బగళన్‌ అన్నారు. 2021లో ఆశ్యర్యాలు చోటుచేసుకుంటాయని రజనీ అనడం.. హిమాలయాలకు వెళ్లినపుడు అక్కడ ఎవరో చెప్పిన మాటలనే వల్లించారని వీసీకే అధ్యక్షులు తిరుమావళవన్‌ చమత్కరించారు. రజనీ పేర్కొన్నట్లుగా 2021లో అన్నాడీఎంకే, డీఎంకే లేని కొత్త ప్రభుత్వం ఆవిర్భవిస్తుందని అమ్మముక ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ జోస్యం చెప్పారు.

(this news is taken from sakshi news)

dailyreport

Author

dailyreport

Up Next

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *