ముషారఫ్‌కు మరణశిక్ష

No Comment Yet
392 Views

ముషారఫ్‌కు మరణశిక్ష

పాకిస్తాన్‌ కోర్టు తీర్పు

రాజ్యాంగాన్ని రద్దుచేసి సైనిక పాలన విధించినందుకు తీర్పు

ఇస్లామాబాద్‌: సైనికాధ్యక్షుడిగా ఉంటూ సైనికపాలన విధించిన పాకిస్తాన్‌ మాజీ సైనికాధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు పాకిస్తాన్‌ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. రాజ్యాంగాన్ని తాత్కాలికంగా రద్దు చేసి, సైనిక పాలన విధించి తీవ్ర దేశద్రోహానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై కోర్టు మరణశిక్ష విధించింది. 1999లో తిరుగుబాటు ద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకొని, అధ్యక్షుడి స్థానాన్ని చేజిక్కించుకొని, నిరంకుశంగా పరిపాలించిన ముషారఫ్‌ దేశద్రోహ నేరానికి పాల్పడ్డారని కోర్టు అభిప్రాయపడింది. 2014లో ముషారఫ్‌ పై ఈ కేసు నమోదైంది.పెష్వార్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ వక్వార్‌ అహ్మద్‌ సేథ్‌ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల స్పెషల్‌ కోర్టు పాకిస్తాన్‌ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి నందుకుగాను, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 6 ప్రకారం పర్వేజ్‌ ముషారఫ్‌ను దోషిగా ఉగ్రవాద నిరోధక ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. నవంబర్‌ 19న రిజర్వులో ఉంచిన తీర్పుని సింద్‌ హైకోర్టు (ఎస్‌హెచ్‌సీ) జస్టిస్‌ నజర్‌ అక్బర్, లాహోర్‌ హై కోర్టు జస్టిస్‌ షాహీద్‌ కరీమ్‌ల బెంచ్‌ మంగళవారం వెల్లడించింది.

కోర్టు తీర్పు పూర్తి వివరాలు వెల్లడించలేదు. కోర్టు తీర్పుపై తన అభిప్రాయాన్ని వెల్లడించేందుకు ముషారఫ్‌ అందుబాటులో లేరు. అయితే ఫిర్యాదులను, రికార్డులను, వాదనలు, కేసులోని వాస్తవాలను పరిశీలించిన మీదట ముగ్గురు న్యాయమూర్తుల్లో ఇద్దరు ముషారఫ్‌కి వ్యతిరేకంగా మెజారిటీ తీర్పుని వెల్లడించారు. 2007లో ముషారఫ్‌ దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించి, సైనిక పాలన విధించినప్పుడు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. అత్యవసర పరిస్థితి విధించడంతో దేశంలో పౌరుల హక్కులు హరణకు గురయ్యాయి, మానవ హక్కులకు అర్థం లేకుండా పోయింది. 2007 నవంబర్‌ నుంచి 2008 ఫిబ్రవరి వరకు పాకిస్తాన్‌లో అత్యవసర పరిస్థితి కారణంగా ఎటువంటి ప్రజాస్వామిక పాలనకు అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది.

అధ్యక్షస్థానంలో ఉండి ముషారఫ్‌ సైనికాధిపతిగా వ్యవహరించడంతో ముషారఫ్‌ పాలనలో జనం విసిగిపోయారు. సుప్రీంకోర్టు జడ్జీలనూ ఆనాడు గృహ నిర్బంధంలో ఉంచారు. అనేక మంది జడ్జీలను విధుల నుంచి తొలగించారు. తర్వాత 2008లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తనకు మద్దతిచ్చిన ఓ రాజకీయ పార్టీ వైఫల్యంతో ముషారఫ్‌ పాకిస్తాన్‌ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత ముషారఫ్‌ విదేశాలకు పారిపోయాడు. విదేశాలకు పారిపోయిన ముషారఫ్‌కి ఈ శిక్ష అమలు చేయడం ఇప్పుడు సవాల్‌గా మారనుంది. దుబాయ్‌లోని ఆసుపత్రి పడకపై నుంచి ముషారఫ్‌ గత నెలలో ఓ వీడియో రికార్డింగ్‌ను విడుదల చేశారు. అందులో కేసులో తనపై న్యాయమైన విచారణ జరగడంలేదని ఆరోపించారు. అలాగే ‘జాతికి సేవ చేశాను. దేశ అభ్యున్నతి కోసమే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను’ అని వీడియోలో ముషారఫ్‌ వ్యాఖ్యానించారు. ఈ తీర్పుని ముషారఫ్‌ పై కోర్టులో చాలెంజ్‌ చేయొచ్చని న్యాయనిపుణులు వెల్లడించారు. అమెరికాపై నవంబర్‌ 9 న జరిగిన దాడుల అనంతరం ఉగ్రవాదంపై పోరులో ముషారఫ్‌ అమెరికా పక్షం వహించడం పట్ల మతపరమైన పార్టీలు విమర్శలు గుప్పించాయి. పాకిస్తాన్‌లో ఇస్లామిస్ట్‌ హింసకు దారితీశాయి.

(this news is taken from sakshi news)

dailyreport

Author

dailyreport

Up Next

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *