ముంచుతున్న మంచు!

No Comment Yet
359 Views

ముంచుతున్న మంచు!

2 నెలల్లో 440 ఘటనలు.. 67 మంది మృత్యువాత

రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్న తెల్లవారుజాము రోడ్డు ప్రమాదాలు

రెండు నెలల్లో 440 ప్రమాదాలు.. 67 మంది మృత్యువాత

విశ్రాంతి స్థలాలు లేకపోవడంతో రోడ్లపైనే వాహనాల నిలిపివేత

రవాణా శాఖ పరిశీలనలో వెలుగుచూసిన నిజాలు

కనీస సౌకర్యాలు కల్పించేందుకు రవాణా, పోలీసు శాఖ కార్యాచరణ

గతనెల 4న తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ వద్ద చెన్నై నుంచి భువనేశ్వర్‌కు కార్ల లోడుతో వెళ్తున్న ఓ కంటైనర్‌ కాల్వలోకి దూసుకెళ్లింది. ఎన్‌హెచ్‌–16పై రావులపాలెం–రాజమహేంద్రవరం మధ్య ఏటిగట్టు జంక్షన్‌లో జరిగిన ఈ ప్రమాదంలో లారీ డ్రైవరు ఎస్‌కే అబ్దుల్, క్లీనర్‌ ఎస్‌కే డానేష్‌ హక్‌లు మృతిచెందారు. తెల్లవారుజామున మంచు కారణంగా జంక్షన్‌ వద్ద ములుపు కనిపించకపోవడంతోనే ఈ దుర్ఘటన జరిగింది. లఇలా రాష్ట్రంలో గత సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో 440 వరకు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 67 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో 250కు పైగా జాతీయ రహదారులపైన జరగ్గా 42 మంది మరణించారు.

ఈ ప్రమాదాలకు మితిమీరిన వేగం, డ్రంకెన్‌ డ్రైవ్, రోడ్డు ఇంజనీరింగ్‌ లోపాలు ఓ కారణమైతే.. తెల్లవారుజామున మంచు కూడా ఓ ప్రధాన కారణమని రవాణా శాఖ అధ్యయనంలో తేలింది. దీంతో రవాణా శాఖా అధికారులు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. డ్రైవరును ఆపి ముఖం కడుక్కోడానికి నీళ్లివ్వడం, టీ అందించడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డిసెంబరు, జనవరి నెలల్లో మంచు కారణంగా అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని అంచనా వేసిన అధికారులు టోల్‌గేట్లు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో పోలీసులతో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. వీటన్నింటి కోసం ఇటీవలే రూ.120 కోట్లు మంజూరు చేశారు. దీంతో ఎలక్ట్రానిక్‌ బోర్డులు, రోడ్లపై డైవర్షన్‌ బోర్డులను రేడియం స్టిక్కర్లతో ఏర్పాటుచేస్తున్నారు.

భారీ వాహనాలతో ప్రమాదాలు
జాతీయ రహదార్లపై ఎన్‌హెచ్‌ఏఐ (నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) విశ్రాంతి స్థలాలు సరిగ్గా ఏర్పాటుచేయకపోవడంతో రోడ్ల వెంబడే భారీ వాహనాలు నిలిపి ఉంచుతున్నారు. మంచులో కనిపించక వెనుక నుంచి అతివేగంతో వస్తున్న వాహనాలు వీటిని ఢీకొంటున్నాయి. దీంతో అక్కడికక్కడే మరణిస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో పదుల సంఖ్యలో జరిగాయి. మరోవైపు.. నిబంధనల ప్రకారం ఐదు గంటల కంటే ఎక్కువసేపు వాహనాన్ని డ్రైవరు నడపకూడదు. రెండో డ్రైవర్‌ విధిగా ఉండాలి. కానీ, వాహన యజమానులు రెండో డ్రైవరును పంపకపోవడంతో ప్రమాదాలు అధికమయ్యాయి.

ప్రమాదాల నివారణకు నీళ్లు, టీ అందిస్తున్నాం
గతేడాది గుంటూరు జిల్లాలో ఒక్క డిసెంబరులోనే మూడు రోజుల వ్యవధిలో పొగమంచు కారణంగా తెల్లవారుజామున 15 మరణాలు చోటుచేసుకున్నాయి.  పోలీసుల సహకారంతో ఆ సమయంలో వాహనాలను ఆపి డ్రైవర్లను ముఖం కడుక్కోమని సూచిస్తున్నాం. ఇందుకు నీటిని సమకూరుస్తున్నాం. అలాగే, వారంలో మూడుసార్లు డ్రైవర్లకు టీ అందిస్తున్నాం.
– మీరా ప్రసాద్, గుంటూరు డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌

పొగమంచు వల్ల..  కంటిచూపుపై ప్రభావం
పొగమంచు వల్ల కంటి చూపుపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సాధారణ వెలుగు కంటే మంచులో ప్రయాణం అంటే 40 శాతం చూపు తగ్గిపోతుంది. అదే 40 ఏళ్లు పైబడిన డ్రైవరుకు చత్వారం సమస్య తోడవుతుంది. ఎదురుగా వచ్చే వాహనాల లైటింగ్‌వల్ల కూడా చూపు తగ్గుతుంది. దీనికి తోడు తెల్లవారుజామున కళ్లు మూతపడతాయి. ఆ సమయంలో డ్రైవర్లకు విశ్రాంతి అవసరం.
– డాక్టర్‌ నరేంద్రరెడ్డి, సూపరింటెండెంట్, కర్నూలు ప్రాంతీయ కంటి ఆస్పత్రి

(this content taken from sakshi news)

dailyreport

Author

dailyreport

Up Next

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *