మీ రుణం తీర్చుకుంటున్నా..

No Comment Yet
77 Views

మీ రుణం తీర్చుకుంటున్నా..

‘నాన్నను మీరు అమితంగా ప్రేమించారు.. నాన్న చనిపోయిన తర్వాత నాకు ఎవరూ లేరన్న సందర్భంలో మీ వెనుక మేమంతా ఉన్నామని కుటుంబంలా నాకు తోడుగా నిలబడ్డారు. మీ బిడ్డగా నన్ను దీవించారు.. ఆశీర్వదించారు. ఇవాళ మీ బిడ్డగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నందున మీ రుణం తీర్చుకుంటున్నా’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో రూ.1,329 కోట్లతో చేపట్టిన 24 అభివృద్ధి పనులకు బుధవారం ఉదయం ఆయన పులివెందుల ధ్యాన్‌చంద్‌ క్రీడా మైదానంలో శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున హాజరైన స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. తొలివిడతగా ఈ పనులకు శ్రీకారం చుట్టామని, రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

 పలు గ్రామాల్లో కొత్త చెరువుల తవ్వకం..

‘‘గండికోట ప్రాజెక్టు దిగువన ముద్దనూరు మండలం ఆరవేటిపల్లె, దేనేపల్లె వద్ద 20 టీఎంసీల సామర్థ్యంతో కొత్తగా రిజర్వాయర్‌ నిర్మిస్తాం. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఇంజనీర్లు సర్వే చేశారు. రాబోయే రోజుల్లో ఈ డ్యామ్‌కు శంకుస్థాపన చేస్తాం. దీంతో జిల్లాలో కరువు పరిస్థితిని అధిగమిస్తాం. ముద్దనూరు –  కొడికొండ చెక్‌పోస్టు (పులివెందుల–బెంగుళూరు) రోడ్డును విస్తరిస్తాం. పెండింగ్‌లో ఉన్న పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌ (పీబీసీ), లింగాల బ్రాంచ్‌ కెనాల్, గండికోట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులను పూర్తి చేస్తాం. నియోజకవర్గంలో చెరువులు లేని గ్రామాల్లో కొత్త చెరువులు తవ్వుతాం. సర్వే చేయించి.. ఆ చెరువులకు దగ్గరలో ఉన్న కాలువలతో అనుసంధానం చేసి పూర్తిగా నింపే కార్యక్రమం చేస్తాం. ఆ చెరువులకు మైక్రో ఇరిగేషన్‌తో లింక్‌ చేసి ఆయకట్టుకు నీరందిస్తాం.

మొత్తం పీబీసీ ఆయకట్టును మైక్రో ఇరిగేషన్‌ కిందకు తీసుకొస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా చాలా చేయాల్సినవి చాలా ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించి డీపీఆర్‌లు సిద్ధమవుతున్నాయి. రాబోయే పర్యటనల్లో వాటికి శంకుస్థాపనలు చేస్తాను. ఇవాళ 24 పనులకు (జాబితా చదివారు) శంకుస్థాపన చేస్తున్నా’’ అని సీఎం జగన్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ సీఎంలు ఎస్‌బీ అంజద్‌బాష, ఆళ్ల నాని, మంత్రులు శంకర నారాయణ, ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, మాజీ మేయర్, కడప పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

(this news is taken from sakshi news)

dailyreport

Author

dailyreport

Up Next

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *