మీ కార్డును స్విచాఫ్‌ చేయండి

No Comment Yet
166 Views

మీ కార్డును స్విచాఫ్‌ చేయండి

శ్రీధర్‌కు రెండు డెబిట్‌ కార్డులు… మూడు క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి. ఇవన్నీ వీసా, మాస్టర్, మ్యాస్ట్రో కార్డులే కావటంతో ప్రపంచవ్యాప్తంగా చెల్లుబాటవుతాయి. కాకపోతే గతనెల్లో వచ్చిన ఓ క్రెడిట్‌ కార్డు, ఓ డెబిట్‌ కార్డు బిల్లులో… తాను వాడకపోయినా ఏకంగా రూ.45,000 వాడేసినట్లుంది. ఎక్కడ వాడానని చూస్తే… అంతర్జాతీయ ఈ–కామర్స్‌ సైట్లలో వాడినట్లు ఉంది. తనకస్సలు ఆ వెబ్‌సైట్ల పేర్లే తెలియవంటూ బ్యాంకుకెళ్లాడు. బ్యాంకు అధికారులు పరిశీలించారు. కార్డుల డేటా సేకరించి… ఓటీపీ అవసరం లేని సైట్ల ద్వారా ఆ లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చెయ్యమన్నారు. చేసేదేమీ లేక శ్రీధర్‌ పోలీసుల్ని ఆశ్రయించాడు.

ఇది శ్రీధర్‌ ఒక్కడికే పరిమితమైన గొడవ కాదు. చాలామంది ఇప్పుడు ఇలాంటి ఫిర్యాదులతోనే పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే చాలా విదేశీ ఈ–కామర్స్‌ వెబ్‌సైట్లు తమ ద్వారా లావాదేవీలు జరిపినపుడు ఒన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) అడగటం లేదు. ఓటీపీ అక్కర్లేకుండానే కార్డు నంబరు, పేరు, ఎక్స్‌పైరీ తేదీ, సీవీవీ వంటి వివరాలిస్తే లావాదేవీ పూర్తయిపోతోంది. దీంతో లావాదేవీ పూర్తయ్యాకే ఫోన్లకు మెసేజీ వస్తోంది. కొన్ని బ్యాంకుల నుంచైతే ఆ మెసేజీ కూడా రావటం లేదు. దీంతో డబ్బులు పోగొట్టుకోవటం కస్టమర్ల వంతవుతోంది. మరి దీన్ని అడ్డుకోవటం ఎలా..? ఆ చర్యల వివరాలే ఈ వారం ‘ప్రాఫిట్‌ ప్లస్‌’ ప్రత్యేక కథనం… 

టెక్నాలజీతో పాటు సైబర్‌ నేరాలూ పెరుగుతున్నాయి. దీంతో కంపెనీలు కూడా వినియోగదారుల డేటా రక్షణకు అత్యాధునిక చర్యలు తీసుకుంటున్నాయి. అందులో ఒకటి… మన లావాదేవీల్ని మనమే నిలిపేసుకోవటం. మన కార్డును మనమే నియంత్రించుకోవటం. మనకు కావాల్సినపుడు మన కార్డును స్విచాన్‌ చేసుకోవటం… అక్కర్లేనపుడు ఆఫ్‌ చేసుకోవటం. ఇలా గనక చేస్తే… మన కార్డుపై మనకు తెలియకుండా లావాదేవీలు జరపటం ఎవ్వరి తరమూ కాదు. అదెలాగో చూద్దాం…

ఇప్పుడు ప్రతి బ్యాంకుకూ ప్రత్యేక మొబైల్‌ అప్లికేషన్‌ (యాప్‌) ఉంది. ఆ అప్లికేషన్‌ ద్వారా ఖాతా వివరాలు తెలుసుకోవటం, నగదు బదిలీ చేసుకోవటం, చెక్‌బుక్‌కు అభ్యర్థన పంపటం, ఈ–డిపాజిట్లు తెరవటం, బిల్లులు చెల్లించటం… ఇలా చాలా పనులు చేసుకోవచ్చు. దీంతోపాటే.. మన ఆన్‌లైన్‌ లావాదేవీల్ని, కార్డు ద్వారా జరిపే లావాదేవీలను నియంత్రించుకోవచ్చు కూడా.
 దీనికోసం ‘మేనేజ్‌ యువర్‌ కార్డ్‌’ విభాగంలోకి వెళ్లాలి. దాదాపు అన్ని బ్యాంకుల యాప్‌లలోనూ ఈ సౌలభ్యం ఉంటుంది. కాకపోతే దీని శీర్షిక ఒక్కో యాప్‌లో ఒకోలా ఉండొచ్చు.
– ఆ విభాగంలోకి వెళ్లినపుడు అక్కడ మీరు వాడుతున్న డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ అదే బ్యాంకు నుంచి ఒకటికన్నా ఎక్కువ కార్డులు వాడుతున్నట్లయితే ఆ కార్డులన్నీ కనిపిస్తాయి. వాటిలో మనకు కావాల్సిన కార్డును సెలక్ట్‌ చేసుకోవాలి.
– ఆ కార్డును సెలక్ట్‌ చేసుకున్న తరవాత దానికి సంబంధించిన ఆప్షన్లు వస్తాయి. ఆ ఆప్షన్లలో… మొత్తం లావాదేవీలన్నిటినీ నిలిపేయటం… విదేశీ లావాదేవీల్ని మాత్రమే నిలిపేయటం… స్వదేశీ లావాదేవీల్ని మాత్రమే నిలిపేయటం వంటివి ఉంటాయి. వాటిలో మనం దేన్నయినా సెలక్ట్‌ చేసుకోవచ్చు. ఉదాహరణకు విదేశీ లావాదేవీల్ని మాత్రమే నిలిపేశామనుకోండి. విదేశాల నుంచి ఎవ్వరు మీ కార్డు నంబరుతో లావాదేవీలు చేసినా అది తిరస్కరణకు గురవుతుంది. దాంతో విదేశీ లావాదేవీల నుంచి మీ కార్డును కాపాడుకున్నట్లేనన్న మాట.
– విదేశీ లేదా స్వదేశీ ఆన్‌లైన్‌ లావాదేవీలకు, విదేశీ లేదా స్వదేశీ పీఓఎస్‌ మెషీన్ల ద్వారా (స్వైపింగ్‌) జరిగే లావాదేవీలకు పరిమితులను కూడా మీరే నిర్దేశించుకోవచ్చు. ఉదాహరణకు విదేశీ, స్వదేశీ లావాదేవీలు రెండింటికీ ఆన్‌లైన్‌ ద్వారా రూ.5,000 పరిమితిని పెట్టుకున్నారనుకోండి… అంతకన్నా ఒక్క రూపాయి ఎక్కువున్నా ఆ లావాదేవీని బ్యాంకు అనుమతించదు. మీ అంతట మీరు లావాదేవీ జరిపినా అంతే. అలాగే పీఓఎస్‌ల ద్వారా కూడా. మీరు గనక ఒక పరిమితిని నిర్దేశిస్తే… దాన్ని మించిన మొత్తానికి లావాదేవీ జరిగితే అది తిరస్కరణకు గురవుతుంది.

ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు…
ఆన్‌లైన్‌ లావాదేవీలకు, పీఓఎస్‌ లావాదేవీలకు యాప్‌ ద్వారా నిర్దేశించుకునే పరిమితులను గానీ… అనుమతించటం, స్విచాఫ్‌ చేయటం వంటివిగానీ యాప్‌లో ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. అదే సెకన్లో… అంటే రియల్‌టైమ్‌లో అది అప్‌డేట్‌ అవుతుంది కూడా. అంటే… మీరు ఆన్‌లైన్‌ లావా దేవీల్ని పూర్తిగా నిలిపేసుకున్నారనుకోండి. ఆన్‌లైన్లో పేమెంట్‌ చేసే ముందు మీ యాప్‌లోకి వెళ్లి నియంత్రణను తొలగించుకోవచ్చు. పేమెంట్‌ పూర్తయిన వెంటనే మళ్లీ నిలిపేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల మీ కార్డులు, మీ ఖాతాలు పూర్తిగా మీ అధీనంలో ఉంటాయి. నకిలీ లావాదేవీలకు ఎలాంటి ఆస్కారం ఉండదు.

కార్డును ఇలా కూడా కాపాడుకోవచ్చు… 
చాలామంది పెట్రోలు బంకుల్లో, రెస్టారెంట్లలో పలు సందర్భాల్లో తమ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుల్ని అక్కడి సిబ్బంది చేతికి ఇస్తుంటారు. ఆ సిబ్బంది వాటిని క్లోన్‌ చేయొచ్చు. లేకుంటే వివరాలు రాసుకున్నా… మొబైల్‌ ఫోన్‌తో రెండువైపులా ఫొటోలు తీసుకున్నా సరిపోతుంది. మన వివరాలన్నీ తన చేతికి చిక్కేసినట్లే. అందుకే పీఓఎస్‌ యంత్రాన్ని మన దగ్గరకే తీసుకురమ్మని చెప్పి… కార్డు మన కళ్లెదురుగానే ఇన్‌సర్ట్‌ చేయించి… మనమే పిన్‌ నంబరు నొక్కితే సరిపోతుంది. అంటే మన కళ్ల నుంచి ఎలాంటి చర్యా తప్పించుకోకుండా చూసుకోవాలన్న మాట.

(this news is taken from sakshi news)

dailyreport

Author

dailyreport

Up Next

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *