బంగారు బుల్లోడు

No Comment Yet
331 Views

బంగారు బుల్లోడు

క్రీడల్లో గోల్డ్‌విన్నర్‌ దినకర్‌

అథ్లెటిక్స్‌లో పసిడి పతకాల పంట

గ్రామీణస్థాయి నుంచి జాతీయ స్థాయికి

ప్రతిభకు పేదరికం అడ్డుకాదనినిరూపిస్తున్న క్రీడారత్నం

పేద కుటుంబం..తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం..సర్కార్‌ బడిలోనే చదివాడు. అందుబాటులోని అవకాశాలనే అందిపుచ్చుకున్నాడు. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. బేస్‌బాల్, లాంగ్‌జంప్, ట్రిపుల్‌జంప్, జావెలింగ్‌త్రో, పరుగుపందెం పోటీల్లో ప్రతిభా పాటవాలు ప్రదర్శించి రాష్ట్ర, జాతీయస్థాయిలో పతకాల మోత మోగిస్తున్నాడు. ఈ కుర్రాడే వెదురుకుప్పం మండలం బొమ్మసముద్రం దినకర్‌. ఆయన విజయబాటను మనమూ చూసొద్దాం..

అడుగుపెడితే స్వర్ణ పతకమే…
అథ్లెటిక్స్‌లో రాటుదేలిన దినకర్‌ తొమ్మిదో తరగతి నుంచే బంగారు పతకాలు సాధిస్తూ వచ్చాడు. ఎక్కడ ఏ మైదానంలో అడుగుపెట్టినా తన సత్తా చూపించి తనేంటో నిరూపిస్తూ ఓప్రత్యేకతను చాటుకున్నాడు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ వివిధ రకాల క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూ పతకాల   పంట పండిస్తున్నాడు.

రూర్కెలా ఎన్‌ఐటీ డైరెక్టర్‌ సంగల్‌ నుంచి బంగారు పతకం అందుకుంటున్న దినకర్‌
క్రీడలపై మక్కువ పెంచుకుని గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొని తన సత్తా ఏంటో నిరూస్తున్నాడు వెదురుకుప్పం మండలం నల్లవెంగనపల్లె గ్రామానికి చెందిన బొమ్మసముద్రం శివాజీ, పుష్ప దంపతుల కుమారుడు దినకర్‌(23). శివాజీకి దినకర్, దయాకర్‌ కుమారులు. శివాజీ గోపాలమిత్ర సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. పుష్ప కూలీ పనులు చేస్తోంది. పేదరికంలో ఉన్నా పిల్లలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే తపన వారికి ఉండేది. పెద్ద కొడుకు దినకర్‌ 5వ తరగతి వరకు అదే గ్రామంలో విద్యనభ్యసించాడు. ఆతరువాత 2005లో నవోదయ ప్రవేశ పరీక్ష రాయడంతో అర్హత సాధించి మదనపల్లెలో ఆరవ తరగతిలో చేరాడు. చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి ఉండేది. ప్రధానంగా బేస్‌బాల్‌పై మక్కువ చూపేవాడు. 6,7 తరగతులు చదివే రోజుల్లో బేస్‌బాల్‌తోపాటు అన్ని క్రీడల్లో పట్టుసాధించి ప్రతిభను కనపరిచేవాడు. పాఠశాల స్థాయిలో జరిగిన గేమ్స్‌లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించి ప్రసంశలు పొందేవాడు.

ఆత్మస్థైర్యమే అండ..
దినకర్‌ క్రీడల్లో చూపుతున్న ప్రతిభను ఫిజికల్‌ డైరెక్టర్‌ సురేంద్రరెడ్డి గుర్తించారు. ‘బేస్‌బాల్‌ ఆటేకాదు..నువ్వు అథ్లెటిక్స్‌ పోటీలకు వెళ్లాలి.. బాగా రాణిస్తావు..నీలో ఆత్మసైర్థ్యం ఉంది..నేను అండగా ఉంటా’ అని వెన్నుతట్టాడు. పీడీ ప్రోత్సాహంతో లాంగ్‌జంప్, ట్రిపుల్‌జంప్, జావెలింగ్‌త్రో, పరుగుపందెం క్రీడల్లో శిక్షణ పొందాడు. పీడీ చెప్పిన మెలకువలు, సూచనలను వంటబట్టించుకున్న దినకర్‌ అథ్లెటిక్స్‌పై పట్టుబిగించాడు. ఒక పక్క చదువులో రాణిస్తూ క్రీడల్లో కూడా తన ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తూ వచ్చాడు. గ్రామీణ, మండల, జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొని తన సత్తాను చాటాడు. ఈక్రమంలో మొట్టమొదటిసారి కర్ణాటకలో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొని విఫలమై వెనుదిరిగాడు. అయినా మొక్కవోని పట్టుదల, ఆత్మవిశ్వాసంతో  పూర్తి స్థాయిలో క్రీడా విద్యలో ఆరితేరాడు.

పతకాల పంట
♦ 2008లో కర్ణాటకలో జరిగిన అథ్లెటిక్స్‌ లాంగ్‌జంప్‌లో ప్రథమస్థానంలో నిలిచి బంగారు పతకం
♦ 2009లో కర్నూలు నవోదయ విద్యాలయలో జరిగిన రాష్ట్ర స్థాయి పరుగు పందెం(100మీటర్లు)లో ప్రథమస్థానం, పరుగుపందెం    (200మీటర్లు)లో ద్వితీయ స్థానం
♦ 2010లో ఢిల్లీలో జరిగిన ఆల్‌ఇండియా జావెలిన్‌ త్రో పోటీలో  ప్రథమ బహుమతి.
♦ ఇంటర్‌గేమ్స్‌లో ప్రథమ స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

జాతీయ స్థాయిలో
♦ 2012లో జార్ఖండ్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ట్రిపుల్‌ జంప్‌లో ప్రథమ స్థానం సాధించి బంగారు పతకం
♦ 2014లో ఒడిస్సాలో జరిగిన ఆల్‌ ఇండియా ఇంటర్‌ కాలేజ్‌ కాంపిటీషన్‌ పోటీల్లో లాంగ్‌ జంప్‌లో గోల్డ్‌మెడల్‌
♦ 2015లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఇంటర్‌ కాలేజ్‌ పోటీల్లో ట్రిపుల్‌ జంప్‌లో ద్వితీయ స్థానం

సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నా
మానసిక ప్రశాంతతకు క్రీడలు చాలా అవసరం. ఆరోగ్యం..శారీరక దారుఢ్యం క్రీడలతోనే సాధ్యం. ఆటల వల్ల అనేక రుగ్మతల నుంచి దూరం కావచ్చు. మెదడు చురుకుగా పనిచేస్తుంది. దీంతో మంచి ఆలోచనలు వస్తాయి. ఐఏఎస్, ఐపీఎస్‌ కావాలన్నదే నా కోరిక. సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నా. ఉన్నత స్థానానికి  ఎదిగితే  గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను పోత్సహించేందుకు కృషి చేస్తా. జాతీయ స్థాయి క్రీడాకారుడిగా గుర్తింపు వచ్చేందుకు నా వెన్నంటి ఉండి ప్రోత్సహించిన పీడీ సురేంద్రరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు.  – దినకర్, అథ్లెటిక్స్‌ క్రీడాకారుడు

(this news is taken from sakshi news)

dailyreport

Author

dailyreport

Up Next

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *