ఊపిరి తీసిన విష వాయువులు

No Comment Yet
138 Views

ఊపిరి తీసిన విష వాయువులు

విష వాయువులు ఊపిరి తీసేశాయి… అప్పటి వరకూ తోటి వారితో కలిసి పనిచేస్తుండగా సంభవించిన దుర్ఘటనతో ఒకరు ప్రాణాలు కోల్పోగా… మరో ఇద్దరి పరి స్థితి విషమంగా ఉంది. జేఎన్‌ ఫార్మాసిటీలోని విజయశ్రీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో బుధవారం రాత్రి 7 గంటల సమయంలో జరిగిన ప్రమాదం ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ దుర్ఘటనకు సంబంధించి పరవాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… విజయ్‌శ్రీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో ప్రొడక్షన్‌ బ్లాక్‌ – 1లోని రియాక్టరు సమీపంలో కొత్త బ్యాచ్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి 7 గంటల సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న కారి్మకులు రసాయనాలను కలుపుతుండగా ఒక్కసారిగా విషవాయువులు వెలువడ్డాయి. దీంతో షిఫ్ట్‌ ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్న సబ్బవరం దరి మల్లునాయుడుపాలేనికి చెందిన పి.అప్పారావు (38), ఆపరేటర్లుగా పనిచేస్తున్న శ్రీకాకుళానికి చెందిన బి.చంద్రమోహన్‌ (34), విశాఖకు చెందిన సీహెచ్‌.శ్రీధర్‌ (38)లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరో ఆపరేటర్‌ బొబ్బిలి దరి చింతాడకు చెందిన సురేష్‌కుమార్‌ (32), హెల్పర్‌గా పనిచేస్తున్న ఒడిశాకు చెందిన నవీన్‌ (32) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

రెండు గంటల అనంతరం వారు స్పహ కోల్పోవడంతో విషయం తెలుసుకున్న యాజమాన్యం రాంకీ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గాజువాకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వారిలో చికిత్స పొందుతూ  సీహెచ్‌.శ్రీధర్‌ గురువారం మధ్యాహ్నం ఆస్పత్రిలో మృతిచెందాడు. మృతునికి భార్య, తల్లి, చెల్లి ఉన్నారు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మిగిలిన వారిని మెరుగైన చికిత్స కోసం నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శ్రీధర్‌ మృతదేహన్ని చూపించకుండా కేజీహెచ్‌కు తరలించడంపై అతని భార్య, బంధువులు గాజువాకలోని    ఆస్పత్రి వద్ద కొంతసేపు ఆందోళనకు దిగారు. గురువారం ఉదయం విషయం తెలుసుకొన్న పరవాడ సీఐ రఘువీర్‌ విష్ణు, పరవాడ తహసీల్దార్‌ గంగాధర్‌ ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యాజమాన్య ప్రతినిధులతో మాట్లాడి కారణాలు తెలుసుకున్నారు.

భద్రత ప్రమాణాలు పాటించకే…  
విజయశ్రీ ఆర్గానిక్స్‌ యాజమాన్యం పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు భద్రత కల్పించకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ఫార్మా సిటీ స్టాప్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు. పరిశ్రమ వద్ద విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. బుధవారం రాత్రి ప్రమాదం జరిగితే గురువారం వరకు గోప్యంగా ఉంచడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. భద్రత ప్రమాణాలు పాటించని పరిశ్రమలపై ఇన్‌స్ఫెక్టరీస్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఫార్మాసిటీ లో విష వాయువులను విడుదల చేస్తున్న పరిశ్రమల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడంలో పీసీబీ యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నారు. విజయశ్రీ పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. శ్రీధర్‌ కుటుంబానికి, అస్వస్థతకు గురైన వారికి న్యాయం చేయాలని కోరారు. లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

(this news is taken from sakshi news)

dailyreport

Author

dailyreport

Up Next

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *