ఉల్లి రిటైలర్ల మాయాజాలం

No Comment Yet
154 Views

ఉల్లి రిటైలర్ల మాయాజాలం

ప్రభుత్వ చర్యలతో హోల్‌సేల్‌ మార్కెట్‌లో దిగొస్తున్న ధరలు

అయినా రిటైల్‌గా అధిక ధరకు అమ్ముతున్న వైనం

నాలుగు రకాల ధరలకు కొనుగోలు చేసి ‘ఏ’ గ్రేడ్‌ ధరకు అమ్మకాలు

రైతుబజార్లలో కిలో రూ.25 చొప్పున  విక్రయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా హోల్‌సేల్‌ మార్కెట్‌లో ఉల్లి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే ఈ మేరకు రిటైల్‌ మార్కెట్‌లో పలువురు వ్యాపారుల మాయాజాలం వల్ల ధర తగ్గడం లేదు. సామాన్యులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కొద్ది రోజులుగా మార్కెటింగ్, సివిల్‌ సప్లయిస్, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగాలు ఉల్లి ధరలను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాయి. మరో వైపు మార్కెటింగ్‌ శాఖ మార్కెట్‌ ధరకు ఉల్లిని కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా కిలో రూ.25 చొప్పున విక్రయిస్తోంది. ఇప్పటి వరకు రూ.25 కోట్లు ఖర్చు చేసి 35 వేల క్వింటాళ్ల ఉల్లిని విక్రయించింది. ధరల స్ధిరీకరణ నిధి నుంచి రూ.16.50 కోట్లను సబ్సిడీ కింద భరించింది.

మాయాజాలం ఇలా..
రాష్ట్రంలోని కర్నూలు, తాడేపల్లిగూడెం మార్కెట్‌లలో గడువులు, మీడియాలు, గోల్టా, గోల్టీ, పేళ్లు, రెమ్మలు అనే రకాల ఉల్లిపాయలు వస్తున్నాయి. ఇందులో గడువులు, మీడియాలు కొన్ని సందర్భాల్లో కిలో రూ.110 వరకు ధర పలికాయి. మిగిలిన రకాలు కిలో రూ.40 నుంచి రూ.60 ధర పలుకుతున్నాయి. వీటి సగటు ధర (40+60+110=210/3) రూ.70గా నిర్ణయిస్తారు. ఈ రకాలన్నింటినీ రిటైలర్లు హోల్‌సేల్‌ వ్యాపారుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. వీటిలో తక్కువ రేటు కలిగిన ఉల్లిని ఎక్కువగా కలిపి ఏ గ్రేడ్‌ రేటుకు అమ్ముతున్నారు. వీటి సగటు ధర కిలో రూ.70 ఉంటే రిటైలర్లు రూ.100 నుంచి రూ.110కి అమ్ముతూ లాభాలు పొందుతున్నారు. రిటైలర్ల క్రయ విక్రయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని వినియోగదారులు కోరుతున్నారు. కాగా, ప్రస్తుతం మంచి నాణ్యత కలిగిన ఉల్లికి కిలోకు రూ.80 నుంచి రూ.100 వరకు ధర వస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతులు వస్తుండటంతో క్రమంగా ధరలు తగ్గుతున్నాయని మార్కెటింగ్‌ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ శారదారాణి తెలిపారు.

ప్రజలకు భారం కాకూడదని.. 
ప్రజలకు భారం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కిలో ఉల్లిపై రూ.80 నుంచి రూ.100 సబ్సిడీ భారాన్ని భరిస్తోంది. ఇలా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంత భారాన్ని మోయడం లేదు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం షోలాపూర్, అల్వార్, కర్నూలు, తాడేపల్లిగూడెం నుంచి ఉల్లిని కొనుగోలు చేసి సబ్సిడీపై ప్రజలకు అందిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో  బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి రూ.150 నుంచి రూ.200 వరకూ పలుకుతోంది. పొరుగునున్న తెలంగాణలో కూడా రైతు బజార్లలోనే కిలో రూ.45కు అమ్ముతున్నారు. మహారాష్ట్రలో కిలో రూ.160, చెన్నైలో రూ.120, ఒడిశాలో రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు. మనరాష్ట్ర ప్రభుత్వం మాత్రం వివిధ మార్కెట్లలో కిలో రూ.120 చొప్పున కొనుగోలు చేసి.. కేవలం రూ.25కే రైతు బజార్ల ద్వారా విక్రయిస్తోంది..
– మోపిదేవి వెంకట రమణారావు, రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ మంత్రి

(this content taken from sakshi news)

dailyreport

Author

dailyreport

Up Next

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *