అంబటి రాయుడు ఫైర్‌: కేటీఆర్‌కు ఫిర్యాదు

No Comment Yet

అంబటి రాయుడు ఫైర్‌: కేటీఆర్‌కు ఫిర్యాదు

హైదరాబాద్‌: టీమిండియా క్రికెటర్‌ అంబటి రాయుడు ఫైర్‌ అయ్యారు. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘంలో (హెచ్‌సీఏ) అవినీతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘంలో అవినీతి కట్టడి చేయాలని తెలంగాణ పారిశ్రామిక, పట్టణాభివృద్ధి మంత్రి కల్వకుంట్ల తారక రామారావ్‌కు ట్విటర్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. క్రికెట్‌ పాలకులలో చాలామందిపై ఏసీబీ కేసులు నడుస్తోంటే రాష్ట్రంలో క్రికెట్‌ ఎలా ఎదుగుతుందని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు.

‘హల్లో.. కేటీఆర్‌ సర్‌. హెచ్‌సీఏలో పేరుకుపోయిన అవినీతి వైపు దృష్టిసారించాలని, దానిని నిర్మూలించాలని కోరుతున్నా. అవినీతి పాలకులు క్రికెట్‌ జట్టుపై ప్రభావం చూపిస్తుంటే మన హైదరాబాద్‌ క్రికెట్‌ గొప్పతనం ఎలా తెలుస్తుంది. పాలకులపై కుప్పలుతెప్పలుగా ఏసీబీ కేసులున్నాయి. వాటిని దాచిపెట్టారు’ అని కేటీఆర్‌కు అంబటి రాయుడు ట్వీట్‌ చేశారు. గతంలోనూ హెచ్‌సీఏలో రూ.100 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు వినిపించాయి.

ఈ మధ్యే జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల్లో మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌ ప్యానెల్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఎన్నికల్లో ఓటమి పాలైన అజహర్‌ ఈ సారి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. కాగా ప్రపంచకప్‌లో చోటుదక్కలేదని భావోద్వేగానికి గురైన అంబటి రాయుడు క్రికెట్‌కు వీడ్కోలు పలికి మళ్లీ యూటర్న్‌ తీసుకున్నారు. వచ్చే ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున ఆడనున్నారు. జాతీయ జట్టుకు ఎంపికవ్వాలన్న పట్టుదలతో కనిపిస్తున్నారు. ఇంతకీ ఇప్పుడే అంబటి ఎందుకు అవినీతిపై ట్వీట్‌ చేశాడో ఎవరికీ అర్థం కావలేదు!!

(this content taken from eenadu news)

 

dailyreport

Author

dailyreport

Up Next

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *