అందుకు ధోనినే కారణం: గంభీర్‌ విమర్శలు

No Comment Yet
276 Views

అందుకు ధోనినే కారణం: గంభీర్‌ విమర్శలు

అవకాశం దొరికినప్పుడల్లా టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిని టార్గెట్‌ చేసే మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ మరోసారి విమర్శలు గుప్పించాడు. సుమారు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను ఉదహరిస్తూ ధోనిపై మండిపడ్డాడు. ఆ మ్యాచ్‌లో తాను సెంచరీని మూడు పరుగుల దూరంలో కోల్పోవడానికి కారణం ధోనినే అంటూ విమర్శించాడు. 2011 వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ధోని సారథ్యంలో టీమిండియా కప్‌ను సగర్వంగా అందుకుంది. ఆ వరల్డ్‌కప్‌ ఫైనల్లో శ్రీలంక 275 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించిన క్రమంలో భారత్‌ దాన్ని 48.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఆనాటి మెగాఫైట్‌లో సెహ్వాగ్‌ డకౌట్‌గా వెనుదిరిగితే, సచిన్‌ టెండూల్కర్‌ 18 పరుగులతో నిరాశపరిచాడు. అటు తర్వాత కోహ్లి(35) ఫర్వాలేదనిపించగా, మ్యాచ్‌ను గంభీర్‌, ధోనిలు ఏకపక్షంగా మార్చారు. గంభీర్‌ 97 పరుగులు చేసి ఔట్‌ కాగా, ధోని 91 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా 1983 వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత రెండోసారి భారత్‌ విశ్వవిజేతగా అవతరించింది.అయితే తాను శతకానికి మూడు పరుగులు దూరంలో నిలిచిపోవడానికి ధోనినే కారణమంటున్నాడు గంభీర్‌. దీనిపై ఇప్పటివరకూ మాట్లాడని గంభీర్‌.. తాజాగా విమర్శలు చేశాడు. ‘ నేను మూడు పరుగులు చేస్తే సెంచరీ చేసే వాడ్ని. దీనిపై నాకు నేనే చాలాసార్లు ప్రశ్నించుకున్నా. అసలు ఆ సమయంలో ఏమైందో ఇప్పుడు చెబుతున్నా. నేను సెంచరీ ఎందుకు చేయలేకపోయానని చాలామంది అడిగారు.

అందుకు ఇదే నా సమాధానం. నేను సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఉండగా ధోని నా దగ్గరకు వచ్చాడు. మూడు పరుగులు చేస్తే శతకం పూర్తవుతుందనే విషయం చెప్పాడు. కానీ నా మదిలో సెంచరీ కంటే కూడా కప్‌ను గెలవడమే ముఖ్యమనే ఆలోచన మాత్రమే ఉంది. ధోని చెప్పడంతో సెంచరీ కోసం ఆలోచించా. అంతవరకూ బాగానే ఉంది. ఆ తర్వాతే ధోని తన గేమ్‌ మొదలుపెట్టాడు. నాకు సెంచరీ చేసే అవకాశం ఇవ్వకుండా తన వ్యక్తిగత స్కోరును పెంచుకోవడం కోసం యత్నించాడు. ఆకస్మికంగా తన వ్యక్తిగత స్కోరు కోసం ఆలోచించాడు. దాంతో నాలో అసహనం వచ్చింది. ఆ క్రమంలోనే పెరీరా బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యా’ అని గంభీర్‌ పేర్కొన్నాడు. ఆ మెగా టోర్నమెంట్‌ ఫైనల్లో సెంచరీ చేయకపోవడం ఇప్పటికీ బాధగానే ఉందని గంభీర్‌ చెప్పుకొచ్చాడు. కేవలం మూడు పరుగుల వ్యవధిలో సెంచరీ కోల్పోవడం తనను ఎప్పుడూ తొలుస్తూ ఉంటుందన్నాడు. ఈరోజుకీ చాలామంది ఎందుకు సెంచరీ పూర్తి చేయలేకపోయావని అడుగుతుంటారని అందుకే వివరణ ఇవ్వాల్సి వచ్చిందన్నాడు.

dailyreport

Author

dailyreport

Up Next

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *